Feeds:
టపాలు
వ్యాఖ్యలు

Archive for the ‘తెలుగుదనం’ Category

సంక్రాంతి

 

సంక్రాంతి లేదా సంక్రమణము అంటే మారడం అని అర్థం. నక్షత్రాల ఇరువది ఏడు. మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు. మొత్తం 108 పాదాలుగా విభజింపబడినాయి. తిరిగి 108 పాదాల్నీ 12 రాశులుగా విభాగించారు. సూర్యుడు నెలకొకరాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కటక, మకర సంక్రమణాలు. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుడు ఏ రాశిలో ప్రవేశిస్తే ఆ రాశి ఆ సంక్రాంతిగా వ్యవహరింపబడుతుంది. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. వీటిలో మకర సంక్రమణాన్ని “సంక్రాంతి పండుగ”గా వ్యవహరిస్తారు. అంటే జనవరి 14 తేదీన సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు. హేమంత ఋతువులో, శీతగాలులు వీస్తూ మంచు కురిసే కాలంలో సూర్యుడు మకరరాశిలోకి మారగానే వచ్చే మకర సంక్రాంతికి ఎంతో ప్రాముఖ్యం ఉంది.

 

ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక లలో “సంక్రాంతి” అని; తమిళనాడు లో “పొంగల్” అని, మహారాష్ట్ర, గుజరాత్ లలో “మకర్‌సంక్రాంతి” అని, పంజాబు, హర్యానా లలో “లోరీ” అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు.

 

 ��ోగి మంటలు

భోగి:  ఇది జనవరి 13న వస్తుంది. నాలుగు మార్గాల కూడలిలో వేయబడే పెద్ద మంట. ఈ రోజున ఉదయం తెల్లవారక ముందే, అంటే 3:30, 4:00 మధ్యలో అందరూ లేచి భోగి మంటలు వెలిగిస్తారు. ఇంట్లో ఉండే పాత చీపుర్లూ, తట్టలూ, మూల మూలల చెత్తా, పనికిరాని కర్ర దుంగలూ ఓచోట చేర్చి, భోగి మంటలు వేసి, ఎముకలు కొరికే చలిని తరిమి కొడతారు. దీనిని సంవత్సరంలో ఆ కాలంలో ఉండే చలి పారద్రోలటానికే, కొత్తవాటితో నిత్య నూతన జీవితం ఆరంబించటానికి గుర్తుగా ఈ రోజున భోగి మంటలు వెలిగిస్తారు.

 

సాయంత్రం పూట ఇళ్ళలో చిన్న పిల్లలు బొమ్మల కొలువును ఏర్పాటు చేస్తారు. బొమ్మల కొలువులో పిల్లలు తమ దగ్గర ఉన్న వివిధ రకాల ఆటవస్తువులను ప్రదర్శనగా ఉంచి ఆనందిస్తారు. ఇంకొంత మంది భోగి పళ్ళ పేరంటం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ పేరంటాళ్ళు మరియు బందువులు సమావేశమై, రేగిపళ్ళు, శనగలు, పూలు, చెరుకుగడలు, మరియు కొన్ని నాణాలను కొత్త బట్టలు వేసుకున్న పిల్లలపై ఆశీర్వాద సూచకంగా కుమ్మరించి దిష్టి తొలగిస్తారు. బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండు. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.

 

సంక్రాంతి:  రెండవ రోజయిన సంక్రాంతి రోజున పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. దాదాపుగా అందరి ఇళ్ళలో అరిసెలు, బొబ్బట్లు, జంతికలు, సకినాలు, పాలతాలుకలు, సేమియాపాయసం, పరమాన్నం, పులిహోర, గారెలు మొదలయిన వంటకాలు చేసి, కొత్తబట్టలు ధరించి ఈ పండుగను ఆస్వాదిస్తారు.ఈ రోజున పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు.ప్రతీ సంక్రమణానికీ పితృతర్పణాలు ఇవ్వాలి. కాని, మిగిలిన పదకొండు సంక్రమణాలకు ఇవ్వక పోయినా, ఈ మకర సంక్రమణానికి మాత్రం తప్పకుండా పితృ తర్పణాలు ఇస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులలో నల్ల నువ్వులు వాడరు. కాని సంక్రాంతి పర్వధినాన మాత్రం నల్లనువ్వులతో మరణించిన పిత్రుదేవతలందరికీ తర్పణములివ్వడం ఎక్కువగా చేస్తుంటారు. దీన్నే పెద్దలకు పెట్టుకోవడం అంటుంటారు. సంక్రాంతి పర్వధినాలలో వారి వారి ఆచార సంప్రదాయాలను అనుసరించి ఈ కార్యక్రమము చేస్తుంటారు. ఈ రోజు బూడిద గుమ్మడి కాయ దానము ఇస్తారు.

సంక్రాంతి ముగ్గు

 సంక్రాంతి ముగ్గు

సంక్రాంతి ముగ్గులకు ఎంతో ప్రత్యేకత ఉంది. రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్దతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్దతిలో పెట్టబడు చుక్కలు రాత్రి వేళ కనిపించే నక్షత్రాలకు సంకేతం. చుక్కలచుట్టూ తిరుగుతూ చుక్కలను గళ్ళలో ఇమిడ్చే ముగ్గు ఖగోళంలో ఎప్పడికప్పుడు కనిపించే మార్పులకు సంకేతం. ఎంత పెద్దదైనా చిన్నదైనా ముగ్గు మద్య గడిలో పెట్టే చుక్క సూర్యు స్థానానికి సంకేతం. ఇక వివిధ ఆకారాలతో వేయు ముగ్గులు విల్లు ఆకారం పునర్వసు నక్షత్రానికీ, పుష్పం పుష్యమీ నక్షత్రానికీ పాము ఆకారము ఆశ్లేష కూ, మేక, ఎద్దు, పీత, సింహం, ఇలాంటివి మేష , వృషభ, మిధున, కర్కాటక రాసులకూ, తొమ్మిది గడుల ముగ్గు నవగ్రహాలు కూ సంకేతాలుగా చెప్పచ్చు.

 హరిదాసు

పెద్ద వయసు స్త్రీలు ముగ్గులు పెడుతుంటే చిన్న వయసు ఆడపిల్లలు ఆవు పేడతో చేసి పెట్టే గొబ్బెమ్మలు,  కృష్ణుని భక్తురాళ్ళైన గోపికలకు సంకేతం. ఈ ముద్దల తలమీద కనుపించే రంగుల పూలరేకులు, పసుపు కుంకుమలు ఆ గోపికలందరూ భర్తలు జీవించియున్న పునిస్త్రీలకు సంకేతం. ఆ గోపికా స్త్రీల రూపాలకు సంకేతమే గోపీ+బొమ్మలు= గొబ్బెమ్మలు. మద్య ఉండే పెద్ద గొబ్బెమ్మ గోదాదేవికి సంకేతం. సంక్రాంతి రోజులలో వీటి చుట్టూ తిరుగుతూ పాటలు పడుతూ నృత్యం చేసే బాలికలంతా కృష్ణ భక్తి తమకూ కలగాలని ప్రార్ధిస్తుంటారు. దీనిని సందె గొబ్బెమ్మ అంటారు. గొబ్బెమ్మలు పొద్దున పూట ముగ్గులో ఉంచి, దానిపై గుమ్మడి పూలు తొ అలంకారం చేస్తే చాలా అందంగా ఉంటుంది. గొబ్బిళ్ళతో ఇంటి ముందరి భాగాన్ని అలంకరించి హరిని కీర్తించే భక్తులకు సాక్షాత్ శ్రీకృస్ణుడే హరిదాసు రూపంలో వస్తాడని సంకేతం. హరిలో రంగ హరీ అంటూ నడినెత్తిపై నుంచి నాసిక దాకా తిరుమణి పట్టెలతో, కంచు గజ్జెలు ఘల్లుఘల్లుమనగా చిందులు త్రొక్కుతూ, చేతుల్లో చిరుతలు కొడుతూ కోడిగుడ్డు లాంటి బోడి తలపై రాగి అక్షయపాత్ర కదలకుండా హరిదాసు ప్రత్యక్షమవుతాడు. ఆయన తలమీద మంచి గుమ్మడి కాయా ఆకారంలో గల పాత్ర గుండ్రముగా ఉండే భూమికి సంకేతం దాన్ని తలమీద పెట్టుకొని ఉండటం శ్రీ హరి అయిన తానే భూమిని ఉద్దరిస్తున్నానని { ఉత్+దరించు= తలమీద పెట్టుకోవడం} అని చెప్పే దానికి సంకేతం. హరినామ కీర్తన చేస్తూ రావడం తను ఏ భోగాలకూ లొంగను కేవలం హరినామ సంకీర్తనకే వచ్చే వాడిననీ తనకు తమపర భేదాలు లేవనీ అందుకే ప్రతి ఇంటికీ తిరుగుతూ వస్తాడనే సంకేతం.

 గాలి పటాలు

సంక్రాంతి అనగానే పిల్లలు ఎక్కువ ఆసక్తి కనబర్చేది, గాలి పటాలు ఎగుర వేయడం.  కొత్త సూర్యుడు ఉత్తరాయణ రూపంలో వస్తుంటే మానవమాత్రులమైన మనం అంత ఎత్తుకి వెళ్ళలేం కాబట్టి, మనం ఎగురవేస్తున్న గాలిపటాలు సూర్యునికి స్వాగతాన్ని పలుకుతాయనడానికి  సంకేతం. అవి ఎగురుతున్న విధానం, గాలి ప్రవాహం, పారుదల ఎటుందో తెలుసుకోడానికి సంకేతం.

 గంగిరెద్దు

సంక్రాంతి రోజులలో మనము చూసే ఇంకో సుందర దృశ్యం.. గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దులవారు. ముందు వెనుకల చెరో ప్రమదునితో {శివ గణం} ఎత్తైన మూపురం శివలింగాకృతిని గుర్తుచేస్తూ శివునితో సహా తను సంక్రాంతి సంభరాలకు హాజరయ్యానని చెప్పే సంకేతం గంగిరెద్దు. ఆవు లేదా ఎద్దు ఇంటి ముందు ముగ్గులో నిలిచిందంటే ఆనేల ధర్మభద్దమైనదని అర్ధం. చక్కగా అలంకరించిన గంగిరెద్దులను ఇంటింటికీ తిప్పుతూ, డోలు, సన్నాయి రాగాలకు అనుగుణంగా వాటిచేత చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి. ఆ గంగిరెద్దులు మనము ఇచ్చే కానుకలను స్వీకరిస్తున్నట్లుగా తలలు ఊపుతూ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మోకాళ్ళ మీద వంగటం వంటి విద్యలు వాటికి నేర్పిస్తారు. అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్ళు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని అడుక్కుంటారు. మీరు చేసే దానమంతా ధర్మభద్దమేనంటూ దానిని మేము ఆమోదిస్తున్నామని ఇంటింటికీ తిరుగుతుంటారు.

 కనుమ

కనుమ:  దీన్నే పశువుల పండుగ అని అంటారు. తమ చేతికొచ్చిన పంటను తామేకాక, పశువులూ, పక్షులూ పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు. పల్లెల్లో పశువులే గొప్పసంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. మూడవ రోజయిన కనుమ వ్యవసాయంలో తమకు ఎంతో చేదోడువాదోడు ఉన్నందుకు పశువులకు శుభాకాంక్షలు తెలుపటానికి జరుపుతారు. కొన్ని ప్రాంతాలలో కోడి పందాలు కూడా నిర్వహిస్తారు. కనుమ నాడు మినుము తినాలనేది సామెత. దీనికి అనుగుణంగా, ఆ రోజున గారెలు, ఆవడలు చేసుకోవడం ఆనవాయితీ. కనుమ మరునాటిని ముక్కనుమ అని అంటారు. దీనికి బొమ్మల పండుగ అని పేరు.

మూడు రోజులతో పూర్తవుతూ అందరికీ ఆనందాన్ని పంచే పండుగను ఘనంగా సాగనంపేందుకు పుట్టినదే రధం ముగ్గు. మనిషి శరీరం ఒక రథం వంటిదని, ఆ శరీరపు హృదయంలో పరమేశ్వరుడుంటే అతడు సజ్జనుడవుతాడని సంకేతం. ఒక రథం ముగ్గుతో మరో ఇంటివారి రథం ముగ్గుకి ముగ్గుతో తాడుని వేస్తూ కలుపుతూ పోతూంటారు. అందరం ఒకరికి ఒకరంగా వుంటూ, ఐకమత్యంగా వుంటూ, కలసి సహజీవనం సాగించాలని చెప్పడానికి సంకేతం.

 

ఇంతటి విశిష్టమైన పండుగ వింతశోభలు తిలకించాలి అంటే గ్రామసీమలే పట్టుగొమ్మలు. ప్రతి ఇల్లు నూతనంగా ముత్యాల ముగ్గులతో పచ్చని తోరణాలతో, కళకళలాడుతూ, “సంక్రాంతి లక్ష్మీ” ని ఆహ్వానిస్తూ ఉంటాయి. గొబ్బెమ్మల పూజ, గంగిరెద్దుల హడావుడి, హరిదాసుల రాకడ, కోడిపందాలు, ఎడ్లపందాలు, బంతిపూల తోరణాలు, కొత్త జంటల విహారాలు, ఎంతో ఆహ్లదకరంగా కనిపిస్తాయి.

 

 
ఇంత చక్కని ఆనందాన్నీ మనకు అందించే “సంక్రాంతి” పండుగలు మనం జరుపుకుని,  మహారాణిలావచ్చే ఆ సంక్రాంతి లక్ష్మీని మన ముంగిటలోనికి ఆహ్వానం పలుకుదాం.  అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు.

Read Full Post »

పల్లె పిలుస్తోంది! (ఈనాడు-ఆదివారం, 11 జనవరి, 2009)

సంక్రాంతి

ఏడాదికోసారైనా పల్లెటూరికెళ్లాలి. ఆ బంధాల్ని నెమరేసుకోవాలి. ఆ బంధుత్వాల్ని పలకరించుకోవాలి. ఆ జ్ఞాపకాల్ని తడిమిచూసుకోవాలి. పల్లెచుట్టూ అల్లుకున్న పెద్దపండగ…సంక్రాంతికెళ్తే ఆ సందడి మరీ బావుంటుంది!

‘అదిగో మాపల్లె.
అదే రామాలయం. పక్కనే చెరువు. అందులో తామర్లు.
నాగలి భుజానికెత్తుకుని వెళ్తున్నారే, వాళ్లే మా వూరి రైతులు.
ఆ బట్టావు మాదే. చెంగుచెంగున గెంతులేస్తున్న లేగదూడ దాందే.
గ్లాస్కోపంచె కట్టుకున్న పెద్దమనిషిలా డాబుగా కనిపిస్తోందే, అది మునసబుగారి మేడ…’
‘అదిగో ద్వారక! ఆలమందలవిగో, అందందు గోరాడు నల్లదియే కోట నదేయగడ్త వారల్ యాదవుల్…’ సారథిని చూడబోతున్న పార్థుడి పరవశమే మనదీ.
తేరు నడిపి పోరు గెలిపించే బావ, ఒట్టి బావేనా. మంత్రి, మిత్రుడు, గురువు, వేలుపు… అన్నీ!
ఆపల్లె మాత్రం మనకు అంతకంటే తక్కువా?

10cover21

పాతికేళ్లు వచ్చేదాకా కడుపులో పెట్టుకుని దాచుకోలేదూ! పెద్ద చదువులకని విజయవాడ వెళ్లినా, హైదరాబాద్ వెళ్లినా… ఠంచనుగా ఒకటో తారీఖు ఆ వూరి పోస్టాఫీసు ముద్రతో మనీ ఆర్డరు రావాల్సిందే. పట్నానికి ఎవరొచ్చినా ఆ వూరి పచ్చళ్లు దిగాల్సిందే. ఆ వూరి నెయ్యి గుబాళించాల్సిందే. ఆవూరి యాస కుశలప్రశ్నలు అడగాల్సిందే. తిరుగుటపాలో ఆ సమాచారమంతా అమ్మకు చేరాల్సిందే.

10cover31

ఆ బడి…
అమెరికాలో పెద్ద సాఫ్ట్‌వేర్ ఇంజినీరు కావచ్చు. సెక్రటేరియేట్‌లో మాలావు అయ్యేయస్ కావచ్చు. ఎవరైతేనేం, రెండొకట్లు రెండేనన్న తొలిసత్యం చెప్పిన ఆ బడికి చేతులెత్తి వెుక్కాలి.
అసెంబ్లీకో, పార్లమెంటుకో వెళ్తే వెళ్లొచ్చు. మంత్రిగారు అనిపించుకోవచ్చు. ఎంతెత్తు ఎదిగినా, పంతులుగారి కోదండం గుర్తుకొస్తే దండం పెట్టుకోవాలి.
డాక్టర్లుగా, లాయర్లుగా, సైంటిస్టులుగా, నాయకులుగా… ఎదగాలన్న కోరికున్న ఎవరికైనా ‘తొలుత అవిఘ్నమస్తనుచు’ అక్షరాలు దిద్దించి, ఆశీర్వదించేది ఆ బడే.
ఇప్పుడంతా కాన్వెంట్లకు వలసపోతున్నారు కానీ, ఓ తరం క్రితం వీధిబడంటే… సామ్యవాద మంటపం!
మునసబుగారి అబ్బాయి, కరణం గారి అమ్మాయి, సర్పంచిగారి తమ్ముడు, పాలేరు పిల్లలు, దళితవాడ బాలలు… అంతా పక్కపక్కన కూర్చుని పాఠాలు చదువుకున్న చోటిది.
పంతులుగారి బెత్తానికి తేడాతెలియదు. ఆయన మనసు లాగానే!
అందరికీ ఒకే పాఠం. ఒకే ప్రేమ.

10cover4

ఆ గుడి…
గుళ్లోని రాములవారికి మనమంటే ఎంత అభిమానం!
చిన్నప్పుడు, ప్రసాదం కోసం దొంగ ప్రదక్షిణలు చేస్తుంటే కిసుక్కున నవ్వినట్టు అనిపించేదికాదూ!
హైస్కూలు రోజుల్లో, బడెగ్గొట్టి గుడి మెట్లమీద ఎంగిలి బీడీలు రుచిచూస్తుంటే గండ్రు కోతిని పంపి భయపెట్టలేదూ!
నూనూగు మీసాలప్పుడు, బంతిపూల బుట్ట అందించే సాకుతో పూజారిగారమ్మాయి కొనచేతిని తాకినప్పుడు, కల్లోకొచ్చి ‘ఆరి భడవా…’ అని మెత్తగా వెుట్టికాయలేయలేదూ!
చదువులైపోయాక, ధ్వజస్తంభం దగ్గర కూర్చుని ‘ఇంకా ఉద్యోగం రాలేదే’ అని దిగులుపడుతుంటే… హఠాత్తుగా ప్రత్యక్షమై ‘మనవడా! నీ భవిష్యత్ బంగారం’ అని ధైర్యం చెప్పిన నామాల తాతయ్య అచ్చంగా గర్భగుళ్లోని రాములోరిలా లేడూ!

ఆ మడి… 

 పంట ఇరగబండుతుంది. నాన్న మీసం మెలేస్తాడు. ఇదే తగిన సమయమన్నట్టు ‘పుట్టెడు వడ్లు లాగేస్తా’నంటూ కర్రెద్దు కాలుదువ్వుతుంది. ఒంటిగా కాడి భుజానికెత్తుకుంటుంది.
తప్పెట్లు వోగుతాయి. మందుగుండు పేలుతుంది. ఊరుఊరంతా కదిలొస్తుంది. ‘అందరి భోజనాలూ ఇక్కడే’… మైకు లేకుండానే అమ్మ అనౌన్స్‌మెంటు!
రైతుకు పంటను మించిన పండగ లేదు. పంటాపండగా కలిసొచ్చే అపురూప సందర్భం… సంక్రాంతి!
అందుకే, ఎన్ని పండగలున్నా పల్లె పౌష్యంవైపే వెుగ్గుతుంది. దసరాకీ దీపావళికీ అప్పు చేసి మరీ బిడ్డలకు బట్టలు పెట్టే రైతన్న, సంక్రాంతికి సగర్వంగా నగదిచ్చి కొంటాడు. నచ్చింది తింటాడు.
అలాగని, అన్ని సంక్రాంతులకీ ఈ వైభోగం ఉండదు. అకాల వర్షం ఆకలిమీదున్న దెయ్యంలా పంటని నాశనం చేసిన రోజులున్నాయి. పీడలా దాపురించే చిడలు గింజల్లోని గుజ్జుని గుట్టుగా తినెళ్లిపోయిన దాఖలాలున్నాయి. పొలంనిండా పంటున్నా గిట్టుబాటు ధరల్లేనప్పుడు, కలోగంజో తాగి ‘మా ఆవిడ పూర్ణాలు చేసిందని’ ఆపద్ధర్మంగా అబద్ధాలు చెప్పిన అనుభవాలున్నాయి. ఆ కరవు సంక్రాంతికి హరిదాసు భిక్షపాత్ర నిండదు. గొబ్బెమ్మలొచ్చినా, దిగాలుగా కూర్చుంటారు. బట్టలు పెట్టలేక మామగారు కొత్తల్లుళ్లకు వెుహంచాటేస్తారు. ముగ్గుల్లో రంగులు తప్ప, జీవం ఉండదు. గ్రామానికి అంత కష్టం ఎప్పుడూ రాకూడదనే కోరుకోవాలి. పల్లె పచ్చగా ఉంటేనే, దేశం సుభిక్షంగా ఉంటుంది. 

10cover5

ఆ ఇల్లు…

 ‘మాతాత కట్టించాడని’ ముత్తాత చెప్పేవాడట! అంత పాతది. అయితేనేం, ఎంత దర్జా? చుట్టుపక్కల ఎన్ని డాబాలు వెలిసినా ఆ బిగువెక్కడిది, ఆ సొగసెక్కడిది. పండక్కి సున్నం వేయించినా చాలు, షష్టిపూర్తి పెళ్లికొడుకులా వెలిగిపోతుంది. ఆ గడప దాటాలంటే, ఓ వోస్తరు పిల్లలకు కూడా పెద్దల సాయం కావాలి. ఆ వీధి అరుగు పంచాయతీ తీర్పులకు, హరికథా కాలక్షేపాలకు, నిశ్చయ తాంబూలాలకు, పెళ్లి తలంబ్రాలకు సువిశాల వేదిక. పేరుతెలియని తాపీమేస్త్రీ రాళ్లూ సున్నమే కాదు, కాస్తంత టెక్నాలజీని కూడా జోడించి కట్టుంటాడా ఇంటిని. లేకపోతే, వేసవిలో అంత చల్లదనమేమిటి, చలికాలంలో ఆ వెచ్చదనమేమిటి?
నోస్టాల్జియా… ఓ నోస్టాల్జియా!
పల్లెను తలుచుకుంటేనే ఎన్ని జ్ఞాపకాలు. మిగతారోజుల్లో ఎక్కడికెళ్తాయివన్నీ. నత్త భయంభయంగా గుల్లలోకి ముడుచుకుపోయినట్టు… గుండె పొరల్లో దాక్కుంటాయేవో! అయినా, బయటికొచ్చే అవకాశం మనమెప్పుడు ఇచ్చాం గనుక. ఉద్యోగాలూ వ్యాపారాలూ ప్రవోషన్లూ బ్యాంకు బ్యాలెన్సులూ… ఇదేగా మన ప్రపంచం.
అప్పుడప్పుడైనా దులపకపోతే పుస్తకాలు చెదలుపడతాయ్. జ్ఞాపకాలూ అంతే. పుస్తకాల్ని అరల్లోంచి తీసి, చిరుగులుంటే అతుకులేసి, చెదపురుగులుంటే మందులేసి, పాతబడుంటే అట్టలేసి, చిందరవందరైతే కుట్లేసి జాగ్రత్తగా మళ్లీ యథాస్థానంలో పెట్టినట్టు…

పల్లెచుట్టూ అల్లుకున్న బాల్యాన్నీ ఆ బాల్యం చుట్టూ అల్లుకున్న కమ్మని జ్ఞాపకాల్నీ నెమరేసుకోడానికి, ఆ జ్ఞాపకాల్లోని పాత్రధారుల్ని కళ్లారా చూసుకోడానికి సంక్రాంతి సరైన సమయం. పంట చేతికొచ్చుంటుంది కనుక, రైతన్న ఖాళీగా ఉంటాడు. రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లి తీరిగ్గా కబుర్లు చెబుతాడు. నాలుగు డబ్బులుంటాయి కనుక, సకల మర్యాదలు చేస్తాడు. గింజలేరుకోడానికెళ్లిన పక్షులు గూటికొచ్చినట్టు, ఎక్కడెక్కడికో వలస వెళ్లినవాళ్లంతా పిల్లాపాపలతో వస్తారు. పాత స్నేహితుల్ని కలుసుకోవచ్చు. పాత బంధువుల్ని పలకరించొచ్చు. అన్నింటికీ మించి, సంక్రాంతికి సొంతూరి యాత్ర ఓ భావోద్వేగపరమైన అవసరం. పిల్లలకైతే అది విజ్ఞాన యాత్ర. అనుబంధాల యాత్ర.

10cover6

సకుటుంబ ప్రయాణం…
కుటుంబ సభ్యులంతా ‘కలసి’ ప్రయాణించడంలో గొప్ప అనుభూతి ఉంది. ‘నువ్వు, నేను, మనం… వెరసి ఓ చిన్న ప్రపంచం’ అన్న సంకేతముంది. ఎంతలేదన్నా ఆ పదిపన్నెండు గంటలూ అందరూ నూటికి నూరుపాళ్లు కుటుంబం మనుషులు. మిగతా సమయాల్లో కాదని కాదు. అప్పుడు, ఎవరి వ్యాపకాలు వాళ్లకుంటాయి. ఎవరి ఒత్తిళ్లు వాళ్లకుంటాయి. ఎవరి లక్ష్యాలు వాళ్లని వెంటాడుతుంటాయి. ఎవరి వినోదమాధ్యమాలు వాళ్లని ఉల్లాసపరుస్తుంటాయి. భోజనం ముందు కూర్చున్నా, కాఫీ తాగుతున్నా… మానసికంగా యాభైశాతం గైరుహాజరే. ప్రయాణంలో అలా కాదు. బండి కదలగానే, బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. కళ్లముందు కనిపిస్తున్న ఆత్మీయులే సర్వస్వమైపోతారు. కాబట్టే, ‘సకుటుంబ ప్రయాణం అనుబంధాలకు రీఛార్జి లాంటిది’ అంటారు సైకాలజిస్టులు. మనలో మనం తొంగిచూసుకోడానికి కూడా ప్రయాణంలోనే కాస్త తీరిక దొరుకుతుంది. మీరు లాప్‌టాప్ తీసుకెళ్లకండి. పిల్లల్నీ పాఠ్యపుస్తకాలు తీసుకురమ్మని ఒత్తిడిచేయకండి. ఇష్టమైన సంగీతం, నచ్చిన నవల, ఓ చెస్‌బోర్డు… అంతవరకైతే ఫర్వాలేదు.

మీరు, మీ గ్రామం, మీ బాల్యం… మీ జ్ఞాపకాల్ని పిల్లలకు కథలుగా చెప్పండి. ముఖ్యంగా అనుబంధాల గురించి. మమ్మీ, డాడీ, నేను… ఇదే వాళ్లకు తెలిసిన ‘మై ఫ్యామిలీ’. అసలైన కుటుంబం ఎంత పెద్దదో, ఎవరికి ఎవరేం అవుతారో, ఎందుకవుతారో వాళ్లకు తెలియాలి. గంపెడు పిల్లల్ని నానమ్మ ఒంటిచేత్తో ఎలా సాకిందో, నాన్న పెద్దచదువులకెళ్తే ఊరవతల మామిడితోట ఎందుకు చేతులుమారిందో వాళ్ల మనసులకెక్కాలి. లేదంటే, ఆ తరానికి అనుబంధాలకు అర్థం తెలియదు.

‘కాలుష్యం’ లేదు!

 ట్రాఫిక్ ఉండదు. ఫ్యాక్టరీ గొట్టాలుండవు. కార్లూబైకులూ ఉండవు. ఆటోలుండవు. ఉన్నా వేళ్లమీద లెక్కబెట్టొచ్చు. అంటే, వాయుకాలుష్యాన్ని తప్పించుకున్నట్టే. రణగొణధ్వనులుండవు కాబట్టి, శబ్దకాలుష్యానికి దూరంగా ఉన్నట్టే. ఆ లెక్కన నాలుగురోజులూ మీరెంత స్వచ్ఛమైన వాతావరణంలో బతుకుతారో ఊహించుకోండి. కూరగాయలూ దాదాపుగా పెరట్లో పండించుకున్నవే. ఆ మేరకు ఎరువులూ క్రిమిసంహారకాలి దుష్ఫ్రభావాలకు దూరంగా ఉన్నట్టే. అన్నిటికీ మించి భావకాలుష్యం అస్సలుండదు. కల్లాకపటంలేని మనుషులు. హద్దుల్లేని ఆత్మీయతలు. సహజమైన అభిమానాలు. తిట్టినా మెచ్చుకున్నా మనసు లోతుల్లోంచే. అక్కడ ఎవరూ ఎవరికీ డిటెక్టివ్‌లు కాదు. హిపోక్రసీ అవసరం లేదు. మీ కార్పొరేట్ ఆఫీసులో ఉన్నట్టు… రచ్చబండ దగ్గరో, చెరువుగట్టు మీదో మైక్రో కెమేరాలుండవు. హాయిగా మాట్లాడుకోవచ్చు. మనసువిప్పుకోవచ్చు. ఇన్నేళ్లుగా వెుహానికి అతికించుకున్న మాస్కు తీసి భోగిమంటల్లో తగలబెట్టొచ్చు. సిటీకి వెళ్లాక ఇంకోటి కొనుక్కోవచ్చులెండి. నగరజీవుల్లో మానసిక సమస్యలకు ప్రధాన కారణం… మనసులోని భావాల్ని వెళ్లగక్కుకోడానికి ఓ మాధ్యమమంటూ లేకపోవడమే. ఏడాదికోసారైనా పల్లెకెళ్లొస్తే ఆ సమస్య ఉండదు.

పల్లె పాఠాలు

ఊరి పొలిమేరల్లో కాలుపెట్టినప్పటి నుంచి ప్రతి అనుభవం పిల్లలకు ఓ పాఠమే. అసలు, వాళ్లకు ‘పొలిమేర’లంటే ఏం తెలుసు? ‘అప్పట్లో పల్లె స్వయంసమృద్ధం. ప్రతి ఊరూ ఒక యూనిట్. ఏ ఊరికి అవసరమైన ఆహారధాన్యాలు ఆ వూళ్లోనే పండేవి. వూరందరికీ సరిపడా బట్టలు ఏ నేతన్నల వీధిలోనో మగ్గంమీద ముస్తాబయ్యేవి. కుమ్మరి వీధిలో కుండలు, స్వర్ణకారుల వీధిలో నగలు, ఆచార్యుల ఇంట్లో ఆయుర్వేద మందులు… దేనికీ ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరంలేని సమాజమది. అప్పటి ఆర్థిక, సామాజిక, రక్షణ అవసరాలకు అనుగుణంగా ఏర్పాటు చేసుకున్న సరిహద్దులే పొలిమేరలు…’ సుదీర్ఘంగా అనిపించినా, పిల్లలు అర్థంచేసుకోగలరు. వాళ్ల పుస్తకాల్లో ఇంతకంటే క్లిష్టమైన పాఠాలున్నాయి.

10cover7

వూళ్లో కాలుపెట్టగానే ఆత్మీయుల పలకరింపులు వెుదలవుతాయి. నగరాల్లో తాము మాట్లాడే భాషకీ, పుస్తకాల్లో చదివే భాషకీ, టీవీలో చూసే భాషకీ, అక్కడి యాసకీ ఏదో తేడా కనిపిస్తుంది పిల్లలకి. ఫలహారాలయ్యాక తీరిగ్గా ‘మాండలికాల’ గురించి చెప్పాల్సిన అవసరం ఉన్నట్టే. ఆ రెండ్రోజులూ వాళ్లని అచ్చంగా గ్రామీణుల్లా మాట్లాడమని ప్రోత్సహించొచ్చు. సాయంత్రం చెరువుగట్టు వైపు షికారుకు తీసుకెళ్లి… మందలుగా పశువులు తిరిగొచ్చే అందమైన దృశ్యాన్ని చూపించొచ్చు. ‘గోధూళి వేళ’ అంటే ఏమిటో కవితాత్మకంగా చెప్పొచ్చు. ‘పాలు ప్లాస్టిక్ కవర్లలో వస్తాయి’ అనుకునే తరానికి అసలు పాలెలా తయారవుతాయో, ‘పొదుగు లోంచి’ (అంటే?) ఎలా పిండుతారో ప్రత్యక్షంగా చూపించొచ్చు. పొలాలకు తీసుకెళ్లి, పంటలెలా పండుతాయో చెప్పొచ్చు. రైతన్న కష్టమేమిటో వివరించొచ్చు. ‘ఆంటీ’, ‘అంకుల్’ తప్ప మరో చుట్టరికం తెలియని ఆ పసివాళ్లకి పెదనాన్న, పెద్దమ్మ, అత్త, మేనత్త, మేనమామ, బాబాయి, పెదతాత, చినతాత… ఎవరు ఎవరికి ఏమవుతారో చెప్పొచ్చు. నిజానికి ఈ విషయంలో మనం పెద్దగా కష్టపడాల్సిన పనీ లేదు. ‘ఏవమ్మా కోడలా’ అనో, ‘రావోయ్ అల్లుడూ’ అనో ఆ గ్రామీణులే చుట్టరికం కలుపుకుంటారు. తెల్లారేసరికల్లా పిల్లలు ఆంటీ, అంకుల్ మానేసి బంధుత్వాల్లోకి దిగిపోతారు. పంచాయతీ ఆఫీసు ముందు నుంచి వెళ్తున్నప్పుడు పంచాయతీ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో చెప్పొచ్చు. వీధి భాగవతులు, హరిదాసులు, జంగమదేవరలు, బుడబుక్కలవాళ్లు… పల్లెతో ముడిపడిన జానపదుల గురించైతే బోలెడన్ని సంగతులు. అదంతా ఏ పుస్తకాల్లోనూ దొరకని చదువు. ఏ పాఠాల్లోనూ చెప్పని విజ్ఞానం. తిరుగుప్రయాణం అవుతున్నప్పుడు… ‘నాన్నా! ఎర్రావు గంగడోలు ఓసారి ముట్టుకోనా’ అని మీ అమ్మాయి అడిగిందంటే, పల్లె పాఠాలు అర్థమైనట్టే. ‘మమ్మీ! తాతయ్యనీ, నానమ్మనీ, అత్తయ్యల్ని… అందర్నీ మనతో తీసుకెళ్దాం’ అని మీ అబ్బాయి అడిగాడంటే, పల్లెటూరి అనుబంధాలు ఒంటబట్టినట్టే. సంక్రాంతి యాత్ర విజయవంతమైనట్టే!
పునర్దర్శన ప్రాప్తిరస్తు.

 

వూరి కోసం…  

అక్కడ పుట్టారు. అక్కడ పెరిగారు. ఆ వూరి కష్టాలు మీకు కాక ఇంకెవరికి తెలుస్తాయి?
నాలుగు చినుకులు టపటపరాలగానే చిల్లుల కుండలా కారిపోయే సర్కారు బడి పరిస్థితి మారిందో లేదో ఓసారి కనుక్కోండి. అవసరమైతే, మరమ్మతులు చేయించవచ్చు.
అనారోగ్యంతో తాతయ్యో నానవ్మో మంచంపట్టినప్పుడు, మంచి వైద్యం చేయించడానికి నాన్నెంత కష్టపడ్డాడు? పల్లెను ఇంకా ఆ అనారోగ్యం పీడిస్తుంటే, ఓ ఆసుపత్రి కట్టించవచ్చు.
డొక్కుసైకిలు మీద పట్నం కాలేజీకి వెళ్తున్నప్పుడు, ఆ డొంకల దారి ఎన్ని ఇబ్బందులు పెట్టింది? ఆ రోడ్డు ఇంకా అలానే ఉంటే, ఓదారి చూపించాల్సిన బాధ్యత మీదే.
బిందెడు నీళ్లు తెచ్చుకోడానికి పాపం అమ్మెంత కష్టపడేది! ఎండనబడి ఎంత దూరం వెళ్లేది!… ఇప్పటికీ ఊరికి రక్షిత నీరు దిక్కులేదు కదూ! మీరే నడుం బిగించాలి.
చదువుకోవాలన్న కోరికున్నా, చదివే స్థోమత లేకపోవడం ఎంత నరకవో మీకెవరూ చెప్పాల్సిన పనిలేదు. ఓ పదిమంది విద్యార్థులకు పుస్తకాలు కొనివ్వండి. ఓ నలుగురు మెరిట్ విద్యార్థులకు కాలేజీ ఫీజులు కట్టండి. బట్టలు ఇప్పించండి.
ఏ చదువులు చదవాలో, ఏ కోర్సులో చేరాలో ఆ గ్రామీణులకు ఎవరు చెబుతారు? మీలాంటివారు పూనుకుని ‘కెరీర్ గైడెన్స్’ ఇవ్వకపోతే ఆ మాణిక్యాలు మట్టిలో కలిసిపోతాయి.
…ఒక్కరే అంత ఖర్చు భరించడం కష్టమే. కానీ మహానగర పౌరుడిగా నలుగుర్నీ కూడగట్టడం మీకంత కష్టం కాదు. స్పందించే హృదయమున్న ప్రతిఒక్కరి సాయం తీసుకోవచ్చు. లయన్స్‌క్లబ్‌లాంటి స్వచ్ఛంద సంస్థల వితరణ కోరవచ్చు. పరిచయమున్న ఉన్నతాధికారుల సాయంతో నిధులు మంజూరు చేయించవచ్చు. నేతల మీద ఒత్తిడి తీసుకురావచ్చు. మీలా జీవితంలో చక్కగా స్థిరపడ్డ ఆ ఊరిబిడ్డలందర్నీ ఏ వనభోజనాలకో పిలిచి సహకరించమని అడగవచ్చు.

  
ఏ దేశమేగినా…

పల్లె నుంచి పట్నానికి. పట్నం నుంచి నగరానికి. అట్నుంచి ఏ అమెరికాకో, ఆస్ట్రేలియాకో. ప్రతిభకు హద్దులేముంటాయి. ప్రతిభావంతులకు సరిహద్దులేముంటాయి. వాళ్లు ప్రపంచ పౌరులు. ఎంతోమంది ప్రవాసులు ఎంతెత్తు ఎదిగినా, ఎంత ఖ్యాతిని ఆర్జించినా …మూలాల్ని మరచిపోకుండా, అమ్మ లాంటి పల్లెని గుర్తుపెట్టుకుని మరీ అప్పుడప్పుడూ వచ్చిపోతున్నారు. చాలా పల్లెల్లో కొత్త బడులు వెలుస్తున్నాయంటే, కొత్త గుడులు కడుతున్నారంటే, కొత్త నేల సాగులోకి వస్తోందంటే, ఇదంతా ఆ గ్రామాభిమానుల పుణ్యమే!
అమెరికాలో స్థిరపడిన ఉప్పలపాడు బిడ్డ డాక్టర్ సంపూర్ణరావు… గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలంలోని తన స్వగ్రామంలో రూ.30 లక్షలతో ఓ ఆసుపత్రి కట్టించారు. సరైన వైద్యం లేక, అకాలమరణం పాలైన నాన్న జ్ఞాపకార్థం ఆ సత్కార్యానికి పూనుకున్నారు. ఇక ఆ ఊళ్లో అనారోగ్య మరణాలుండవు!
సెయింట్‌లూయిస్‌లో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ సెంటర్ స్థాపించిన హుజూర్‌నగర్ యువకుడు దయాకర్ తాను చదివిన బళ్లోనే పదిమంది పేద విద్యార్థుల్ని దత్తత తీసుకున్నారు. ఇక చదువులకు పేదరికం అడ్డంకి కాదు!
నెల్లూరు జిల్లా, తోటపల్లి గూడూరు మండలం పేడూరుకు చెందిన సుబ్బారెడ్డి… తనకు అఆలు నేర్పిన బడికి మరమ్మతులు చేయించారు. ఇక వానాకాలం చదువులుండవు!
ప్రవాస పారిశ్రామికవేత్త పైళ్ల మల్లారెడ్డి నల్గొండజిల్లాలోని సొంతూళ్లో రూ.2.5 కోట్లతో ఆలయ ప్రాంగణం నిర్మించారు. మరో రూ.2 కోట్లతో జూనియర్ కాలేజీ కట్టించారు. సుంకిశాల ఎంత అదృష్టంచేసుకుంది!
హైదరాబాద్ శివార్లలోని చౌటుప్పల్‌లో మస్కు మధుసూదన్‌రెడ్డి అత్యాధునికమైన క్రీడా ప్రాంగణం కట్టించారు. రేపటి ఒలింపియన్లు అక్కడ తయారవుతున్నారు!
మచ్చుకు కొందరు ప్రవాసుల పేర్లే ఇవి. ప్రచారాన్ని కోరుకోకుండా, ప్రయోజనాన్ని ఆశించకుండా… పల్లెసేవలో పునీతం అవుతున్నవారు ఇంకా చాలామంది ఉన్నారు. అందరి స్ఫూర్తికీ వందనాలు!

Read Full Post »